Surah Al-Mumtahanah with Telugu
ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైన వారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని - వారి మీద ప్రేమ చూపిస్తూ - వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్ ను మీరు విశ్వసించినందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి నా మార్గంలో ధర్మయుద్ధం కొరకు వెళితే (ఈ సత్యతిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకోకండి). వారి పట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలా చేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయినవాడే |
ఒకవేళ వారు మీ మీద ప్రాబల్యం వహిస్తే, వారు మీకు విరోధులవుతారు. మరియు కీడుతో మీ వైపుకు తమ చేతులను మరియు తమ నాలుకలను చాపుతారు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులై పోవాలని కోరుతారు |
మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. ఆయన పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు |
వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు: నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది." ఇక ఇబ్రాహీమ్ తన తండ్రితో: నేను తప్పక నిన్ను క్షమించమని (నా ప్రభువును) వేడుకుంటాను. ఇది తప్ప, నీ కొరకు అల్లాహ్ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు." అని మాత్రమే అనగలిగాడు. (అల్లాహ్ తో ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలుతున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది |
ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు |
వాస్తవాంగా! మీకు - అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని అపేక్షించేవారికి - వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి) |
బహుశా, అల్లాహ్ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్ (ప్రతిదీ చేయగల) సమర్ధుడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు |
కాని, వాస్తవానికి ఎవరైతే, ధర్మ విషయంలో మీతో యుద్ధం చేస్తారో మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడ్తారో మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటంలో పరస్పరం సహకరించుకుంటారో; వారితో స్నేహం చేయటాన్ని అల్లాహ్ మీ కొరకు నిషేధిస్తున్నాడు. మరియు ఎవరైతే వారితో స్నేహం చేస్తారో, అలాంటి వారు, వారే! దుర్మార్గులు |
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి. (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు |
మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్యతిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్ మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధం చేసి విజయం పొందితే)! దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్యతిరస్కారుల వద్దకు పోయారో వారికి - వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్ కు) సమానంగా - చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన అల్లాహ్ యందు, భయభక్తులు కలిగి ఉండండి |
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బైఅత్) చేయటానికి నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు సాటి కల్పించము అని మరియు దొంగతనం చేయము అని మరియు వ్యభిచారం చేయము అని మరియు తమ సంతానాన్ని హత్య చేయము అని మరియు తమ చేతుల మద్య మరియు తమ కాళ్ళ మధ్య నిందారోపణ కల్పించము అని మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపము అని, ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బైఅత్) తీసుకో మరియు వారిని క్షమించమని అల్లాహ్ ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన జాతి వారిని స్నేహితులుగా చేసుకోకండి. వాస్తవానికి గోరీలలో ఉన్న సత్యతిరస్కారులు, నిరాశ చెందినట్లు వారు కూడా పరలోక జీవితం పట్ల నిరాశ చెంది ఉన్నారు |
More surahs in Telugu:
Download surah Al-Mumtahanah with the voice of the most famous Quran reciters :
surah Al-Mumtahanah mp3 : choose the reciter to listen and download the chapter Al-Mumtahanah Complete with high quality
Ahmed Al Ajmy
Bandar Balila
Khalid Al Jalil
Saad Al Ghamdi
Saud Al Shuraim
Abdul Basit
Abdul Rashid Sufi
Abdullah Basfar
Abdullah Al Juhani
Fares Abbad
Maher Al Muaiqly
Al Minshawi
Al Hosary
Mishari Al-afasi
Yasser Al Dosari
لا تنسنا من دعوة صالحة بظهر الغيب