La sourate At-Tawbah en Telugu
بَرَاءَةٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ(1) అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది |
కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. కాని మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్! సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు |
మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద హజ్జ్ రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతోంది: నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు, బహుదైవారాధకులతో, ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు (ఓ ముష్రికులారా!) పశ్చాత్తాపపడితే, అది మీ మేలుకే. కాని మీరు విముఖులైతే, మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి." మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష (విధించబడ) నున్నదనే వార్తను వినిపించు |
కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు |
ఇక నిషిద్ధమాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి. కాని వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే, వారిని వారి మార్గాన వదలి పెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు |
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు |
(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు |
వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి |
لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُعْتَدُونَ(10) వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు |
కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము |
మరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు |
ఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో, అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం |
వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు |
وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ ۗ وَيَتُوبُ اللَّهُ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ(15) మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు |
ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును |
బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు |
నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు |
ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు |
విశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు |
يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَجَنَّاتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ(21) వారి ప్రభువు వారికి, తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలు గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు |
خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ(22) వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది |
ఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు |
వారితో ఇలా అను: మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు |
వాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ (యుద్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు |
తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు. మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం |
ثُمَّ يَتُوبُ اللَّهُ مِن بَعْدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَاءُ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ(27) ఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్). కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు. మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే! అల్లాహ్ కోరితే, తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు |
అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించని; సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో - వారు స్వయంగా తమ చేతులతో జిజ్ యా ఇచ్చి లోబడి ఉండే వరకూ - పోరాడండి |
మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు. మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు) |
వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (క్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు. వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు |
వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి (ప్రసరింపజేసి) తీరుతాడు |
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే |
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూద మతాచారులు (అహ్ బార్) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్ బాన్) ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తిని వేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు |
ఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి |
నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు). ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి. బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి |
నిశ్చయంగా, నెలలను వెనుక ముందు చేయటం (నసీఉ) సత్యతిరస్కారంలో అదనపు చేష్టయే! దాని వల్ల సత్యతిరస్కారులు మార్గభ్రష్టత్వానికి గురి చేయబడుతున్నారు. వారు దానిని ఒక సంవత్సరం ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్ నిషేధించిన (నెలల) సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకొని అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు |
ఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది |
మీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు |
ఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు |
తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది |
అది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్ ప్రయాణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అనిపించింది. కావున వారు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము." (ఈ విధంగా అబద్ధమాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్ కు బాగా తెలుసు |
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే వారెవరో నీకు తెలియక ముందే, వారిని (వెనుక ఉండటానికి) ఎందుకు అనుమతి నిచ్చావు |
అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు |
నిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు |
మరియు ఒకవేళ వారు బయలుదేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుద్ధ సామగ్రి సిద్ధ పరచుకొని ఉండేవారు, కాని వారు బయలు దేరటం అల్లాహ్ కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో: కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండండి!" అని చెప్పబడింది |
ఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు |
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు |
మరియు వారిలో: నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది |
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు |
వారితో ఇలా అను: అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి |
ఇలా అను: మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా, లేదా మా చేతుల ద్వారానా? అని మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరూ నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాము |
قُلْ أَنفِقُوا طَوْعًا أَوْ كَرْهًا لَّن يُتَقَبَّلَ مِنكُمْ ۖ إِنَّكُمْ كُنتُمْ قَوْمًا فَاسِقِينَ(53) ఇలా అను: మీరు మీ (సంపదను) ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అది మీ నుండి స్వీకరించబడదు. నిశ్చయంగా, మీరు అవిధేయులు (ఫాసిఖూన్) |
మరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే |
కావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు! నిశ్చయంగా, అల్లాహ్ వాటి వలన వారిని, ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు |
وَيَحْلِفُونَ بِاللَّهِ إِنَّهُمْ لَمِنكُمْ وَمَا هُم مِّنكُمْ وَلَٰكِنَّهُمْ قَوْمٌ يَفْرَقُونَ(56) మరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు |
لَوْ يَجِدُونَ مَلْجَأً أَوْ مَغَارَاتٍ أَوْ مُدَّخَلًا لَّوَلَّوْا إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ(57) ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు |
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు. దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు |
మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది) |
నిశ్చయంగా దానాలు (సదఖాలు) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు |
మరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు: ఇతను (చెప్పుడు మాటలు వినేవాడు." ఇలా అను: అతను వినేది మీ మేలుకే! అతను అల్లాహ్ ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి." మరియు అల్లాహ్ సందేశహరునికి బాధ కలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది) |
(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత |
ఏమీ? అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి, నిశ్చయంగా! భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందనీ, అదే అతని శాశ్వత నివాసమనీ, వారికి తెలియదా? ఇది ఎంత గొప్ప అవమానం |
తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్ తప్పక బయటపెడ్తాడు |
నీవు వారిని అడిగితే వారు తప్పక: మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడు తున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: ఏమీ? మీరు అల్లాహ్ తో మరియు ఆయన సూచనలతో (ఆయాత్ లతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా |
ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు |
కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు. మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్) |
మరియు కపట విశ్వాసులైన పురుషులకు మరియు కపట విశ్వాసులైన స్త్రీలకు మరియు సత్యతిరస్కారులకు, అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్ వారిని శపించాడు (బహష్కరించాడు). మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది |
(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడి నటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు! వీరే నష్టానికి గురి అయ్యేవారు |
ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్, ఇబ్రాహీమ్ జాతి వారి, మద్ యన్ (షుఐబ్) ప్రజల మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)? వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు |
మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనా పరుడు |
మరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి. వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం) |
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం |
మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాప పడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు |
మరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: ఆయన (అల్లాహ్) తన అనుగ్రహంతో మాకేమీ ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము |
فَلَمَّا آتَاهُم مِّن فَضْلِهِ بَخِلُوا بِهِ وَتَوَلَّوا وَّهُم مُّعْرِضُونَ(76) కాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారికి (ధనం) ప్రసాదించినప్పుడు, వారు పిసినారితనం ప్రదర్శించి, తమ (వాగ్దానం) నుండి విముఖులై మరలిపోతారు |
ఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు |
أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَاهُمْ وَأَنَّ اللَّهَ عَلَّامُ الْغُيُوبِ(78) ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు |
మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది |
(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు |
(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది |
فَلْيَضْحَكُوا قَلِيلًا وَلْيَبْكُوا كَثِيرًا جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ(82) కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా (మున్ముందు) వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది |
కావున (ఓ ప్రవక్తా!) ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారిలో (కపట విశ్వాసులలో) ఒక వర్గం వారి వద్దకు తీసుకొని పోతే! మరియు వారు నిన్ను (మరొక దండయాత్రకు) పోవటానికి అనుమతి అడిగితే! వారితో అను! మీరు నాతో ఏ మాత్రం బయలుదేర వద్దు! మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు! వాస్తవానికి మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండి పోయిన వారితో (ఇండ్లలోనే) కూర్చొని ఉండండి |
మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు, నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు |
మరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు |
మరియు: అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని సూరహ్ అవతరింప జేయబడి నపుడు, వారిలోని ధనవంతులు నీతో: వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచి పెట్టు." అని అనుమతి కోరారు |
رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ(87) వారు, వెనుక ఉండిపోయే వారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయబడి వుంది, కావున వారు అర్థం చేసుకోలేరు |
కాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు |
అల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం |
మరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు) కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు |
బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
మరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు." అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు |
కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు |
మీరు (తబూక్ దండయాత్ర నుండి) మరలి వారి వద్దకు వచ్చిన తరువాత కూడా వారు (కపటవిశ్వాసులు) మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను: మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్ మాకు మీ వృత్తాంతం తెలిపి వున్నాడు. మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు, తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు |
(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం |
మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు |
ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు |
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు |
మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు. వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం) |
మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు. వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు. మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు |
మరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు. అల్లాహ్ వారిని తప్పక క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత |
(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు |
ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత |
మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు |
మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు |
మరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు |
నీవెన్నడూ దానిలో (నమాజ్ కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమాజ్ కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు |
ఏమీ? ఎవడైతే అల్లాహ్ యందు గల భయభక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు |
వారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు |
నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం |
(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు). ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు |
అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు |
మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే. కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు, సహనశీలుడు |
మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు, అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు |
నిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్ తప్ప మీకు వేరే రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు |
వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు. వారిలో ఒక పక్షం వారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్త వెంట వెళ్ళారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత |
మరియు వెనుక ఉండి పోయిన ఆ ముగ్గురిని కూడా (ఆయన క్షమించాడు). చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకై పోయింది. మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి (తమను కాపాడుకోవటానికి) ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు - వారు పశ్చాత్తాప పడాలని. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత |
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ(119) ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి |
మదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే, దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థ పరచడు |
మరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు (శ్రమపడి) కొండలోయలను దాటే విషయమూ, అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు - వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు - అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి |
మరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు |
ఓ విశ్వాసులారా! మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి, వారిని మీలో నున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితో ఉంటాడని తెలుసుకోండి |
మరియు ఒక సూరహ్ అవతరింప జేయబడినప్పుడల్లా వారి (కపట విశ్వాసుల) లో కొందరు: ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది?" అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరి విశ్వాసాన్ని అధికం చేస్తుంది. మరియు వారు దానితో సంతోషపడతారు |
కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు |
ఏమీ? వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండుసార్లు (బాధలతో) పరీక్షింప బడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాప పడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు |
మరియు ఏదైనా సూరహ్ అవతరించినపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా?" ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థం చేసుకోలేని జనులు |
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు |
అయినా వారు విముఖులైతే, వారితో అను: నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate At-Tawbah : choisissez le récitateur pour écouter et télécharger la sourate At-Tawbah complète en haute qualité.















Donnez-nous une invitation valide